Jubilee Hills

జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక: రాజకీయ యుద్ధం హీటెక్కింది

తెలంగాణలోని జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక రాజకీయ వేదికపై హాట్ టాపిక్‌గా మారింది. జూబిలీ హిల్స్ నియోజకవర్గంలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య నువ్వా-నేనా అంటూ ప్రచారం జోరందుకుంది. పార్టీల సమీకరణాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్‌కు ఎంఐఎం మద్దతు ప్రకటించింది. అయితే, ఎంఐఎం నేరుగా ప్రచారంలో పాల్గొనకుండా, తమ ప్రభావిత డివిజన్లలో మాత్రమే కార్యకర్తలు కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్నారు. ఎర్రగడ్డ, బోరబండ, రెహమత్ నగర్ వంటి ప్రాంతాల్లో ఎంఐఎం ప్రభావం ఎక్కువ కావటంతో మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉంది.

కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ముగ్గురు మంత్రులకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించి, డివిజన్ల వారీగా ఎమ్మెల్యేలకు పని విభజన చేసింది. నవంబర్ 1 నుంచి విస్తృత ప్రచారం మొదలుపెట్టనుంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారంలోకి దిగుతున్నారు. డివిజన్ స్థాయిలో సమావేశాలు, సభలు, రోడ్ షోలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అధికారంలో ఉండటం కాంగ్రెస్‌కు ప్లస్ పాయింట్.

బీఆర్‌ఎస్ సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని పట్టుదలతో ఉంది. ఫామ్‌హౌస్‌లో ఉంటున్న మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల నాయకులతో సమావేశమై వ్యూహాలు రచించారు. కాంగ్రెస్ అభ్యర్థిని ‘రౌడీ షీటర్’ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. బీఆర్‌ఎస్ కూడా ఎంఐఎం నుంచి కొందరు నేతలను చేర్చుకుంటోందని, వారిపైనా క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రశ్నిస్తోంది. ఈ ఆరోపణలు ఓటర్లను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.

కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మాదిరిగా కాంగ్రెస్ ఇక్కడా జెండా ఎగురవేస్తుందా? లేక బీఆర్‌ఎస్ తన సీటును నిలబెట్టుకుంటుందా? అనేది ఫలితాలు తేల్చాలి. అందరి దృష్టి ఈ ఎన్నికపైనే.