ఆదిలాబాద్ జైల్లో బాల్క సుమన్‌తో హరీష్ రావు ములాఖత్

ఆదిలాబాద్: బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్‌ను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బృందం ఆదిలాబాద్ జిల్లా జైలుకు వచ్చింది. మొత్తం 12 మందికి ములాఖత్ అనుమతి లభించింది. హరీష్ తో పాటు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ ఎంబీపు రాజు, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య తదితరులు ఈ బృందంలో ఉన్నారు.

ములాఖత్‌కు ముందు ఎన్టీవీతో మాట్లాడిన హరీష్ రావు, క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌కు ప్రజలు సంపూర్ణ మెజారిటీ ఇచ్చారని, అయితే మంత్రి వివేక్ పోలీసు లాఠీలతో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. “ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. ఓటు ద్వారా గెలవలేకపోతే, అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి గెలవాలనుకుంటున్నారు. ఇది 100 శాతం అక్రమ అరెస్టులు” అని ఆయన అన్నారు.

క్యాతనపల్లిలో 22 సీట్లలో బీఆర్‌ఎస్ 14 సీట్లు గెలుచుకుందని, కాంగ్రెస్ కేవలం 7 సీట్లు మాత్రమే సాధించిందని హరీష్ రావు తెలిపారు. “ఓటమిని అంగీకరించాలి కానీ, ప్రజల తీర్పును కాలరాస్తూ అధికార దుర్వినియోగం చేస్తున్నారు. పోలీసు నిర్బంధాలతో పాలన చేస్తామంటే, ఎన్నికల అవసరం లేదు కదా?” అని ప్రశ్నించారు. తమ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని, ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్ ర్యాలీలను అడ్డుకుని, నేతలను అరెస్టు చేస్తున్నారని హరీష్ ఆరోపించారు. “ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు” అని హెచ్చరించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు జైలు వద్ద ర్యాలీ నిర్వహించారు. ములాఖత్ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ప్రజలు దీనిని సహించరని ఆయన అన్నారు. ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.