వరంగల్ జలమయం: డీఆర్‌ఎఫ్ బోట్లతో రెస్క్యూ యుద్ధం!
వరంగల్ నగరం ఇంకా వరదలో కొట్టుమిట్టాడుతోంది. నిన్నటి భారీ వర్షం తర్వాత రామన్నపేట, ములుగు రోడ్డు, పెద్దమ్మగడ్డ, అలంకార్, ఎస్‌ఎస్‌ఆర్ తోటలతో సహా 20కి పైగా కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లల్లో నీళ్లు నిండి ప్రజలు బయటికి రాలేని దుస్థితి. హనుమకొండలోనూ నాలుగైదు డివిజన్లు మునిగాయి.
డిజాస్టర్ రెస్పాండ్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) 30 మంది సభ్యులు నాలుగు టీమ్‌లుగా విడిపోయి నిన్న మధ్యాహ్నం నుంచి రంగంలోకి దిగారు. ఆరు మోటార్ బోట్లు, 10 అదనపు బోట్లతో ఇళ్లల్లో చిక్కుకుపోయిన వారికి త్రాగునీరు, ఆహార ప్యాకెట్లు అందిస్తున్నారు. గుండె జబ్బు ఉన్నవారు, వృద్ధులు, మహిళలను బోట్లపై సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

“నిన్న రాత్రి 12:30 నుంచి నీళ్లు పూర్తిగా నిండాయి. మంచాలు, ఫ్రిడ్జ్‌లు, బీరువాలు మునిగిపోయాయి. ఐదు మెట్ల నీటిలో రెండు మెట్లు మాత్రమే తగ్గాయి” అని రామన్నపేట నివాసి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది ఇంటి పై అంతస్తులో తలదాచుకున్నారు.
డీఆర్‌ఎఫ్ సభ్యుడు చెప్పినట్టు, “మెడికవర్ ఆసుపత్రి దగ్గర, ములుగు రోడ్డు, రామన్నపేటలో రెస్క్యూ చేశాం. లోతట్టు ప్రాంతాల నుంచి వారిని షిఫ్ట్ చేస్తున్నాం. ఆరు టీమ్‌లుగా పని చేస్తున్నా సరిపోవట్లేదు.” తెలంగాణ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నుంచి 100 మంది సహాయకులు వచ్చారు.
ప్రజలు బయటికి రాలేక ఇళ్లల్లోనే చిక్కుకున్నారు. వరద ఉధృతి తగ్గినా రక్షణ కొనసాగుతోంది. వరంగల్ పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే ఉంది.