తెలంగాణలో 5 లక్షల ఎకరాల పంటలు వరద బీభత్సం!
మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణపై కురిసిన భారీ వర్షాలు రైతుల జీవితాలను అతలాకుతలం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. వరంగల్ జిల్లాలో నష్టం అత్యధికంగా ఉండగా, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలు కూడా ఘోరంగా నష్టపోయాయి.
వరి పంట 2,80,000 ఎకరాల్లో పూర్తిగా నాశనమైంది. పత్తి 1,50,000 ఎకరాల్లో దెబ్బతిన్నది. మొక్కజొన్న 4,000 ఎకరాలు, మిరప 3,000 ఎకరాలు, వేలాది ఎకరాల్లో ఉద్యాన పంటలు (పండ్లు, కూరగాయలు) నీట మునిగాయి. వర్షాలతో పాటు వరదలు పొలాలను జలమయం చేయడంతో రైతులు నిరాశలో మునిగారు.
వరంగల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వరి, పత్తి పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. ఖమ్మం, సూర్యాపేటలో ఉద్యానవనాలు నీటిపాలు. నల్గొండలో మొక్కజొన్న, మిరప పంటలు దెబ్బతిన్నాయి. రైతులు ఈ ఏడాది పెట్టుబడి కోలుకోలేని స్థితిలో ఉన్నారు.
వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో సర్వేలు చేపట్టారు. పూర్తి నష్ట అంచనాలు త్వరలో ప్రకటించనున్నారు. ప్రభుత్వం నుంచి పరిహారం, రుణమాఫీ, కొత్త విత్తనాల సరఫరా కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రుణభారంలో ఉన్న రైతులకు ఈ వరద మరింత దెబ్బ.
తెలంగాణలో వర్షాధారిత వ్యవసాయం ఆధారంగా ఉండటంతో, ఈ నష్టం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపనుంది. ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని రైత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.