గోల్కొండ మిలిటరీ ప్రాంతం లో చిరుత కలకలం.

గోల్కొండ మిలిటరీ ప్రాంతం లో చిరుత కలకలం.

హైదరాబాద్‌లోని గోల్కొండ మిలిటరీ ప్రాంతం లో చిరుత సంచారం స్థానికుల్లో ఆందోళన రేకెత్తించింది. ఇబ్రహీం బాగ్ మిలిటరీ ఏరియాలో చిరుత రోడ్డు దాటుతూ కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. చిరుత తారామతి వెనుక భాగంలోని మూసీ నది దిశగా వెళ్లినట్లు సమాచారం. పోలీసులు వెంటనే అటవీ శాఖ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు.

 గోల్కొండ పోలీసులు అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేస్తూ చిరుతను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం సమయంలో చిరుత రోడ్డు దాటుతూ కనిపించిన దృశ్యాలను ఆర్మీ అధికారులు సీసీ కెమెరాల్లో గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు.

కొద్ది రోజుల క్రితం నార్సింగ్ పరిధిలోని మంచిరేవుల వద్ద కూడా చిరుత సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. అటవీ శాఖ అధికారులు అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ, మొదటి రోజు ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. అయితే, మరుసటి రోజు చిరుత సీసీ కెమెరాల్లో కనిపించడంతో దానిని గుర్తించారు. మంచిరేవుల సమీపంలోని గోల్కొండ ప్రాంతంలో చిరుత కనిపించడంతో, ఇది అదే చిరుత కావొచ్చని అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ ప్రాంతంలో చిరుత ఆనవాళ్లను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు, బోనులు ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోల్కొండ పోలీసులు రాత్రి వేళల్లో ఒంటరిగా ఈ ప్రాంతంలో తిరగవద్దని స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు. అటవీ శాఖ అధికారులు చిరుత పాదముద్రలను సేకరించి, దాని సంచారాన్ని నిర్ధారించే పనిలో ఉన్నారు.