
రైతులకు ఎరువుల సరఫరాపై మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ
సిద్దిపేట జిల్లా అక్కనపేటలో ఫెర్టిలైజర్ షాపును సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్, రైతులందరికీ ఎరువులు సకాలంలో అందించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. కొందరు రాజకీయ లబ్ధి కోసం రైతులను రెచ్చగొట్టి, గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల సరఫరాలో కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనని, దీనిని తొలగించేందుకు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కొందరు సందట్లో సందడిగా రాజకీయం చేస్తూ, రైతులలో ఆందోళన కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఈ తరహా చర్యల వల్ల రైతులలో అనవసర గందరగోళం ఏర్పడుతోందని, అవసరానికి మించి ఎరువులు కొనుగోలు చేసే పరిస్థితి నెలకొంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు రెండు యూనిట్ల ఎరువులు కావాల్సి ఉంటే, ఐదు యూనిట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది అనవసర భయాందోళనలకు దారితీస్తోందని పేర్కొన్నారు.
రైతులకు విజ్ఞప్తి చేస్తూ, ఎరువుల సరఫరాలో ఎలాంటి లోటు లేకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ తగినంత ఎరువులు అందుబాటులో ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు.