యువరాజ్ సింగ్: కోచ్ మోడ్ ఆన్
టీం ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. ఐపిఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జాయింట్స్ (ఎల్ఎస్జి) జట్టుకు ఆయనను హెడ్ కోచ్‌గా నియమించేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. జట్టు యజమాని సంజీవ్ గోయంక భారతీయుడినే ప్రధాన కోచ్‌గా కోరుకుంటున్నారని పలు నివేదికలు తెలిపాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ ఎల్ఎస్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే యువరాజ్‌తో చర్చలు కొనసాగుతున్నట్లు తాజా అప్‌డేట్స్ చెబుతున్నాయి.
ఈ ఒప్పందం ఖరారైతే యువరాజ్ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రొఫెషనల్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఇదే మొదటిసారి అయినప్పటికీ, ఆయన అబుదాబి టీ10 లీగ్‌లో మెంటర్‌గా పనిచేశారు. అలాగే శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, ప్రియాంశ్ ఆర్య, ప్రభ సిమ్రాన్ సింగ్ వంటి యువ ప్రతిభలకు దీర్ఘకాలం శిక్షణ ఇస్తూ వస్తున్నారు.
యువరాజ్ పేరు ఐపిఎల్ జట్లతో ముడిపడటం కొత్త కాదు. గత సీజన్‌లో గుజరాత్ టైటన్స్‌లో ఆశీష్ నెహ్రా విడిపోతే తాత్కాలిక బాధ్యతలు చేపట్టినట్లు నివేదికలు వచ్చాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రికీ పాంటింగ్ స్థానంలో ఆయనను పరిశీలించింది, కానీ చివరికి హేమాంగ్ బదానీని ఎంచుకుంది.
2022లో ఐపిఎల్‌లో అడుగుపెట్టిన ఎల్ఎస్జి మొదటి రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్ చేరింది. కానీ తర్వాతి రెండు సార్లు ఏడవ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో జట్టులో మార్పులు తప్పవని స్పష్టం. యువరాజ్ రాకతో ఎల్ఎస్జి కొత్త ఊపిరి పీల్చుకోవచ్చా? అన్నది ఆసక్తికరం.