
మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు
మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీటి వనరుల వినియోగంపై నిర్లక్ష్యం చూపడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. యెల్లంపల్లిలో ఏడు మోటార్లు ఉండగా, మూడు మాత్రమే నడిపించడం వల్ల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు మోటార్లను నడిపితే రోజుకు రెండు టీఎంసీల నీటిని మిడ్‌మానేర్‌కు తేవచ్చని, అక్కడి నుంచి అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, బసవాపూర్ రిజర్వాయర్లకు తరలించి యాసంగి పంటలకు నీరు అందించవచ్చని ఆయన సూచించారు.
అలాగే ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ గేట్లు ఎత్తి మిడ్‌మానేర్ నింపాలని, అక్కడి నుంచి కాళేశ్వరం మోటార్ల ద్వారా చెరువులు, చెక్‌డ్యామ్‌లు నింపాలని డిమాండ్ చేశారు. ఈ రిజర్వాయర్లు వర్షపు నీటితో నిండవని, కేవలం మోటార్ల ద్వారానే నింపగలమని హరీష్ రావు స్పష్టం చేశారు.
కృష్ణా నదిలో వరదల కారణంగా ఇప్పటికే ఉచితంగా భారీ స్థాయిలో హైడ్రో పవర్ ఉత్పత్తి అవుతుందని, అయినా ప్రభుత్వం కరెంట్ సరఫరా చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. రైతులకు ఎరువులు, పంటల బీమా, అవసరమైన సౌకర్యాలు ఇవ్వకపోవడమే కాకుండా, అందుబాటులో ఉన్న నీటిని సముద్రంలో వదులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే, వేలాది మంది రైతులను తీసుకుని ఆందోళనలు చేపట్టతామని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు.