KALESHWARAM

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కమిషన్ నివేదికపై బిఆర్ఎస్ న్యాయ పోరాటం

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన ఏకపక్ష నివేదికను రద్దు చేయాలంటూ బిఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లలో కమిషన్ ఏర్పాటు జీఓ, నివేదికను రద్దు చేయాలని కోరారు. రాజకీయ కుట్రతో కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు జరిగిందని, గత బిఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఏకపక్ష విచారణ జరిగిందని ఆరోపించారు.

మేడిగడ్డ బ్యారేజ్‌లో ఒక పిల్లర్ కొంగిన సంఘటన ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 650 పేజీల నివేదికను గత నెల 31న ప్రభుత్వానికి సమర్పించిన కమిషన్, విచారణలో సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. కమిషన్ చట్టం 1952లోని సెక్షన్ 8బి ప్రకారం పిటిషనర్లకు నోటీసులు ఇవ్వకుండా, క్రాస్ ఎగ్జామినేషన్ అవకాశం కల్పించలేదని ఆక్షేపించారు.

హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ బెంచ్ విచారణలో, నివేదికను అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటారా లేక చర్యల తర్వాత చర్చిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ తరఫు న్యాయవాది సుదర్శన్ రెడ్డి రెండు రోజుల గడువు కోరగా, హైకోర్టు శుక్రవారమే సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నివేదిక బహిర్గతం, అసెంబ్లీ చర్చలపై హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది.