OPERATION SINDHOOR

ఆపరేషన్ సింధూర్‌ పై పార్లమెంటులో చర్చ.

ఆపరేషన్ సింధూర్‌ పై పార్లమెంటులో చర్చ :

సోమవారం లోక్‌సభలో, మంగళవారం రాజ్యసభలో ‘ ఆపరేషన్ సింధూర్ ’ పై చర్చ జరగనుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ చర్చను ప్రారంభిస్తారు.

హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జయశంకర్‌తో పాటు బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దుబే పాల్గొంటారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ చర్చలో మాట్లాడే అవకాశం ఉంది. రెండు సభల్లోనూ 16 గంటల పాటు ఈ అంశంపై చర్చ జరుగనుంది.

PARLIAMENT OF INDIA

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, అన్ని అంశాలపై ఒకేసారి చర్చ సాధ్యం కాదని, ముందుగా ఆపరేషన్ సింధూర్‌పై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.

ప్రతిపక్షాలు బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై చర్చకు డిమాండ్ చేస్తున్నాయి.అయితే, మొదట ఆపరేషన్ సింధూర్‌పై చర్చ పూర్తి చేసిన తర్వాత ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంటామని రిజిజు స్పష్టం చేశారు.

గత ఐదు రోజులుగా జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష ఆందోళనల కారణంగా ఎలాంటి చర్చలు జరగలేదు. సభ పలుమార్లు వాయిదా పడింది.ఈ నేపథ్యంలో, సోమవారం నుంచి సభను సజావుగా నిర్వహించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.

ఆపరేషన్ సింధూర్‌పై చర్చలో పాకిస్తాన్‌కు సంబంధించిన ఉగ్రవాద కార్యకలాపాలు, భారత్‌పై జరిగిన దాడుల వివరాలను పార్లమెంట్ వేదికగా చర్చించనున్నారు.

విదేశీ వేదికలపై భారత్ తన వైఖరిని స్పష్టం చేసిందని, ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించేది లేదని రిజిజు తెలిపారు.

ప్రతిపక్షాలు దళితులపై దాడులు, విదేశీ విధానం వంటి ఇతర అంశాలపై కూడా చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్‌పైనే ప్రభుత్వం దృష్టి సారించింది.