జమ్మూ కాశ్మీర్ లో మచైల్ మాతా యాత్రలో క్లౌడ్ బర్స్ట్ విషాదం.
జమ్మూ కాశ్మీర్ లో మచైల్ మాతా యాత్రలో క్లౌడ్ బర్స్ట్ విషాదం – 46 మంది మృతి
దేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ జమ్మూ కాశ్మీర్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కిష్త్వార్ జిల్లాలోని మచైల్ మాతాదేవి యాత్ర మార్గంలో క్లౌడ్ బర్స్ట్ సంభవించి అకస్మిక వరదలు దారుణ విధ్వంసం సృష్టించాయి. మచైల్ మాత దర్శనానికి వెళ్తున్న యాత్రికులపై ఒక్కసారిగా విరుచుకపడ్డ ఈ ప్రకృతి ఆగ్రహం 46 మంది ప్రాణాలను బలిగొంది. మరెందరో గల్లంతయ్యారు. మృతుల్లో ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్లు కూడా ఉన్నారు.

భారీ వర్షాల కారణంగా కొండచరియలు, మట్టి, బురద, రాళ్లు కిందికి దూసుకురావడంతో పలు భవనాలు, దుకాణాలు, సెక్యూరిటీ అవుట్‌పోస్టులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 167 మందిని ఆర్మీ సిబ్బంది రక్షించినప్పటికీ, వారిలో 38 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

9500 అడుగుల ఎత్తులోని ఆలయానికి చేరేందుకు భక్తులు చశోతి గ్రామం నుంచి 8.5 కి.మీ. నడక ప్రయాణం చేయాలి. గురువారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్యలో వరద ఒక్కసారిగా విరుచుకపడి, సామూహిక వంటశాల, దుకాణాలు, రహదారులు క్షణాల్లో కొట్టుకుపోయాయి. పెద్ద పెద్ద బండరాళ్లు, బురద నీరు యాత్రా ప్రాంతాన్ని ముంచెత్తాయి.

ఈ ఘటన అనంతరం మచైల్ మాత యాత్రను తక్షణమే నిలిపివేశారు. జూలై 25న ప్రారంభమైన ఈ యాత్ర సెప్టెంబర్ 5 వరకు కొనసాగాల్సి ఉంది. తొమ్మిది రోజుల క్రితం ఉత్తరాఖండ్‌లోని ధరాలి గ్రామాన్ని క్లౌడ్ బర్స్ట్ తుడిచిపెట్టగా, ఇప్పుడు కిష్త్వార్‌లో మళ్లీ అలాంటి విషాదం జరిగింది. ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.