రష్యా లో భారీ భూకంపం, సునామీ : పసిఫిక్ తీర దేశాల్లో గజగజ
రష్యా లో భారీ భూకంపం, రష్యా లోని కంచట్కా ద్వీపకల్పంలో బుధవారం రిక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం పసిఫిక్ తీర దేశాలను గజగజలాడించింది. ఈ భూకంపం ప్రభావంతో రష్యా, జపాన్, అమెరికా, హవాయి, న్యూజిలాండ్‌తో సహా 30 దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. 10 నుంచి 30 అడుగుల ఎత్తులో రాకాసి అలలు తీర ప్రాంతాలను ముంచెత్తాయి, కోట్లాది మంది ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. రోడ్లపై వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ జామ్‌లు సంభవించాయి.

రష్యాలోని సెవెరో కురిల్స్క్ నగరంపై 14 అడుగుల ఎత్తైన అలలు విరుచుకుపడి నిర్మాణాలను ధ్వంసం చేశాయి. జపాన్ తీరంలో 50 సెం.మీ. నుంచి 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడ్డాయి, తిమింగలాలు తీరానికి కొట్టుకొచ్చాయి. హవాయిలో 6 అడుగుల ఎత్తైన అలలు నమోదై, సైరన్లు మోగడంతో నగరాలు ఖాళీ అయ్యాయి. అమెరికాలోని కాలిఫోర్నియా, అలాస్కా, ఒరెగాన్‌లలో 1.6 అడుగుల వరకు అలలు నమోదయ్యాయి. ఈక్వడార్, చిలీ, గువాం, కిరిబాటి వంటి దేశాలు కూడా ముప్పులో ఉన్నాయి.

భూకంపం కేంద్రం పసిఫిక్ మహాసముద్రంలో 21 కి.మీ. లోతులో ఉందని అమెరికా జియోలాజికల్ సర్వీస్ తెలిపింది. ఈ భూకంపం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 10 భూకంపాల్లో ఒకటిగా నమోదైంది. 2011 జపాన్ సునామీని గుర్తుచేసిన ఈ ప్రకృతి విపత్తు, అణు విద్యుత్ కేంద్రాలపై ప్రభావం చూపలేదు. భారతదేశానికి సునామీ ముప్పు లేదని హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్ స్పష్టం చేసింది, ఎందుకంటే భూకంప కేంద్రం హిందూ మహాసముద్రానికి దూరంగా ఉంది.