CHANDANAGAR KHAZANA JEWELLERY

చందానగర్ ఖజానా జ్యువెలరీ లో దోపిడీ.

చందానగర్ ఖజానా జ్యువెలరీ లో దోపిడీ: డిప్యూటీ మేనేజర్‌పై కాల్పులు

చందానగర్‌లో ఖజానా జ్యువెలరీ షాప్‌లో దోపిడీ ఘటన కలకలం రేపింది. మంగళవారం ఉదయం 10:35 గంటలకు ఆరుగురు దుండగులు షాప్‌లోకి చొరబడి, గన్‌తో సిబ్బందిని బెదిరించి లాకర్ కీలు డిమాండ్ చేశారు. కీలు ఇవ్వనందుకు డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్‌పై కాల్పులు జరిపారు, దీంతో అతని కాలికి గాయమైంది. సతీష్ ప్రస్తుతం ప్రమాదంలో లేనట్లు తెలుస్తోంది. దొంగలు సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసేందుకు ఒక షాట్ కాల్చారు.

సుమారు 10 నిమిషాల పాటు షాప్‌లో గందరగోళం సృష్టించిన దుండగులు, సేఫ్ తెరవలేకపోయారు. బయట డిస్‌ప్లేలో ఉన్న కొంత వెండి ఆభరణాలను మాత్రం దోచుకుని, రెండు బైక్‌లపై వికారాబాద్ వైపు పరారయ్యారు. సంఘటనా స్థలాన్ని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పరిశీలించి, సీసీటీవీ ఫుటేజ్‌ను సమీక్షించారు. ఈ కేసులో ఏడుగురు దుండగులు పాల్గొన్నట్లు ప్రాథమికంగా తేలింది. నిందితులను పట్టుకునేందుకు సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ పోలీసులను అప్రమత్తం చేసి, చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు గట్టిచేశారు. క్లూస్ టీమ్‌తో కలిసి ఖాళీ గిల్లీలను విశ్లేషిస్తూ, దర్యాప్తును ముమ్మరం చేశారు.