కరూర్‌లో విజయ్ సభలో విషాదం: 40 మంది మృతి
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, ‘సో మీట్ ది పీపుల్’ అనే నినాదంతో ప్రతి శనివారం రెండు జిల్లాల్లో పర్యటనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నామక్కల్, కరూర్ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. నామక్కల్‌లో సభ మధ్యాహ్నం ముగియాల్సి ఉండగా, ఆలస్యమవడంతో కరూర్‌లో రోడ్‌షో, కార్నర్ మీటింగ్ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. సాధారణంగా సాయంత్రం 7 గంటలలోపు ముగియాల్సిన కార్యక్రమం ఆలస్యమవడం వల్ల భారీ విపత్తు సంభవించిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
కరూర్‌లో భారీ జనసమూహం చేరుకుంది. అంచనాల ప్రకారం 1,500 మంది మాత్రమే రావాల్సి ఉండగా, సుమారు 10 వేల మంది తరలివచ్చారు. ఇంత పెద్ద సంఖ్యలో జనం వచ్చే అవకాశాన్ని పోలీసులు ముందుగా ఊహించలేదని, తగిన భద్రతా చర్యలు తీసుకోలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, పోలీసులు మరిన్ని జాగ్రత్తలు సూచించినా, పార్టీ నాయకులు అంగీకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలు దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

సమావేశంలో అకస్మాత్తుగా తొక్కిసలాట ఏర్పడింది. జనసమూహం ఒకవైపు ఒరిగిపోవడంతో భారీ గందరగోళం నెలకొంది. ప్రస్తుతం 40 మంది మరణించినట్లు సమాచారం. 50 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు, వీరిలో చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలామంది ఆక్సిజన్ లేకపోవడంతో స్పృహ కోల్పోయి, ఆసుపత్రికి చేరేసరికి మరణించారు.
విజయ్ వేదికపై నుంచి మాట్లాడుతూ, కొందరు స్పృహ కోల్పోవడాన్ని గమనించి వెంటనే నీటి బాటిళ్లు ఇవ్వాలని సూచించారు. తన సిబ్బంది ద్వారా బాటిళ్లు కిందికి విసిరేశారు. గత నాలుగు వారాలుగా ఇలాంటి కార్యక్రమాల్లో ముందుజాగ్రత్తగా ఆంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచడం వల్ల, విపత్తు సమయంలో వెంటనే సహాయం అందించగలిగారు. పోలీసులు కూడా జనసమూహం మధ్యలోకి చొచ్చుకువెళ్లి బాధితులను రక్షించే ప్రయత్నం చేశారు.
ఈ ఘటన దురదృష్టకరమైనది. భవిష్యత్తులో ఇలాంటి సమావేశాల్లో మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.