
తెలంగాణ లో సీజనల్ జ్వరాల విజృంభణ.
ఆసుపత్రుల్లో రద్దీ :
తెలంగాణ లో వర్షాకాలంతో సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ప్రతిరోజు 2000–2500 ఓపీ కేసులు నమోదవుతున్నాయి. ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రుల్లోనూ వేల సంఖ్యలో రోగులు వస్తున్నారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా వంటి జ్వరాలతో రోగులు ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. గాంధీ ఆసుపత్రి ఓపీ విభాగంలో ఎనిమిది క్యూ లైన్లు ఏర్పాటు చేసినా రద్దీ తగ్గడం లేదు.
వైద్య సౌకర్యాలు :
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. రోగులకు అవసరమైన మందులు, రక్త నమూనా సేకరణ, టెస్టుల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో న్యూరాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ సేవల కారణంగా మంగళవారం రద్దీ ఎక్కువగా ఉంటుంది.
జాగ్రత్తలు :
వాతావరణ మార్పుల వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయని డాక్టర్ కళ్యాణ్ తెలిపారు. స్వెటర్ ధరించడం, చేతి రుమాలు ఉపయోగించడం, వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఆరోగ్య శాఖ సమీక్షలు నిర్వహిస్తూ, రోగుల సంఖ్యను బట్టి సౌకర్యాలు కల్పిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో రద్దీ కొనసాగుతోంది. రోగులు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు కోరుతున్నారు.