andhra pradesh RED ALERT

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ లో భారీ వర్షాల హెచ్చరిక, ప్రజలకు అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌ కు మరోసారి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, ఎల్లుండికి అల్పపీడనంగా మారే సూచనలున్నాయని తెలిపింది. దీంతో రాబోయే నాలుగు రోజుల పాటు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తున్నాయని హెచ్చరికలు జారీ చేశారు.

అల్పపీడన ప్రభావంతో తెలంగాణ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో పలు చోట్ల పంట పొలాలు మునిగిపోయాయి. సంగారెడ్డి జిల్లాలో పుల్కల్‌లో 14.7 సెం.మీ., నల్లవల్లిలో 9.7, చౌట్కూర్‌లో 9, అమీన్‌పూర్‌లో 8.1, జరాసంగంలో 7.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లాలో శివంపేటలో 12.8, నర్సాపూర్‌లో 10.8, కాగజ్‌నగర్‌లో 9.3, చిన్నశంకరంపేటలో 8.6, టేక్మల్‌లో 7.2 సెం.మీ. వర్షం కురిసింది.

వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సిర్గాపూర్ మండలం గైరాన్ తండాకు వెళ్లే మార్గంలో వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో స్థానికులు ప్రమాదకరంగా వాగు దాటుతున్నారు. కొన్నేళ్లుగా రోడ్డు నిర్మాణం కోరుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.