erra chandhanam

ఎర్రచందనం స్మగ్లింగ్ దందా మళ్లీ రెచ్చిపోతోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా ఆగడం లేదు. ఇటీవల బైరెడ్డిపల్లి మండలం ఆలపల్లి కొత్తూరు సమీపంలోని దండుకుంట పొలాల వద్ద ఓ ఇంట్లో 144 ఎర్రచందనం దుంగలను పలమనేరు ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రామం కర్ణాటక సరిహద్దుకు కూతవేటు దూరంలో ఉండటంతో స్మగ్లర్లు దీన్ని స్టాక్ పాయింట్‌గా మార్చేశారు.

చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి మీదుగా హోస్కోటే సమీపంలోని కట్టిగనహళ్లికి ఎర్రచందనం తరలిపోతోంది. ఈ గ్రామం ఎర్రచందనం స్మగ్లింగ్‌కు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి వసీం ఖాన్, నదీం ఖాన్ వంటి అంతర్జాతీయ స్మగ్లర్లు రెండు దశాబ్దాలుగా ఈ దందాను వృత్తిగా చేసుకుంటున్నారు. గ్రామంలో 20 మంది స్మగ్లర్లు ఉండగా, ఆరుగురు అంతర్జాతీయ స్థాయి డాన్‌లు. వీరు ప్రైవేట్ సైన్యాన్ని నిర్వహిస్తూ, కోళ్ల ఫారాలు, పొలాల ఇళ్లను గోడౌన్లుగా మార్చారు. పోలీసులపై పలుమార్లు దాడులు జరిగాయి.

ఇక్కడి నుంచి చెల్లహళ్ల, బైపల్లి, కగ్గనహళ్ల మీదుగా అడ్డదారుల్లో హోస్కోటేకు తరలిస్తారు. తర్వాత మంగళూరు పోర్టు నుంచి స్టీమర్లలో దుబాయ్ మీదుగా జపాన్, చైనా వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు. పట్టుబడిన దుంగలు A1 గ్రేడ్‌వి. గతంలో నాజర్ ఖాన్ విచారణలో కన్నడ పోలీసులు, పోర్టు సిబ్బంది, కస్టమ్స్ అధికారులు కూడా భాగస్వాములని తేలింది.

ప్రధాన నిందితుడు భాస్కర్ రెడ్డి కనుసన్నల్లో ఈ దందా నడుస్తోంది. బెంగళూరులో జేసీబీ డ్రైవర్‌గా పనిచేసిన ఇతడు స్మగ్లర్‌గా ఎదిగాడు. రైడ్ సమయంలో పక్క పొలంలో ఉన్న భాస్కర్ తన ప్రియురాలితో కారులో పారిపోయాడు. పోలీసులు ఎందుకు పట్టుకోలేదనేది ప్రశ్నార్థకం. ఈ స్మగ్లింగ్‌ను అరికట్టాలంటే కఠిన చర్యలు అవసరం.