
సృష్టి కేసు: ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ
సృష్టి కేసు ను అదనపు ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 25 మందిని అరెస్టు చేసినట్లు నార్త్ జోన్ డిసిపి రష్మి పెరుమాల్ తెలిపారు. గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత అదనంగా ఎనిమిది ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసినట్లు ఆమె వెల్లడించారు.
కేసు నమోదైన తర్వాత అనేక మంది బాధితులు తమను సంప్రదించినట్లు డిసిపి తెలిపారు. నమ్రత అనే వ్యక్తి ఐవీఎఫ్ కోసం వచ్చిన దంపతులను సరోగసీ వైపు మళ్లించి, వైజాగ్‌లోని కేజీహెచ్ వైద్యుల సహకారంతో మోసం చేసినట్లు వెల్లడైంది. డాక్టర్లు విద్యులత, రవి, ఉషలను అరెస్టు చేశారు. సంతానం లేని దంపతులకు సరోగసీ ద్వారా పిల్లలను కలిగిస్తామని నమ్మించి, కౌన్సెలింగ్ ద్వారా వారిని ఒప్పించేది.
నమ్రత దంపతుల నుంచి సేకరించిన వీర్యం, అండాన్ని మరో మహిళ గర్భంలో పెంచుతున్నట్లు నమ్మించి, 30-40 లక్షలు వసూలు చేసేది. అదనంగా సరోగసీ మహిళ ఆరోగ్యం, వైద్య ఖర్చుల పేరుతో మరింత డబ్బు దండుకునేది. గైనకాలజిస్ట్ లెటర్‌హెడ్‌పై ఫేక్ ప్రిస్క్రిప్షన్లు రాసేవారని తేలింది. నవమాసాల తర్వాత అంతర్రాష్ట్ర పిల్లల అక్రమ రవాణా ముఠాల నుంచి శిశువులను కొనుగోలు చేసి, సరోగసీ బిడ్డలుగా అందజేసేది. ఇలా 80 శిశువులను అంటగట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నమ్రత, ఆమె కొడుకు జయంత్ కృష్ణ 20 కోట్లకు పైగా సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు.