
హైదరాబాద్ లో భారీ వర్షాలు: రెడ్ అలర్ట్ జారీ
హైదరాబాద్ నగరం ఇప్పటికే వర్షాలతో అతలాకుతలం అవుతున్న వేళ, భారత వాతావరణ శాఖ (IMD) రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ హెచ్చరికలతో GHMC అధికారులు అప్రమత్తమయ్యారు.
GHMC కంట్రోల్ రూమ్ ద్వారా వాతావరణ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ముందస్తు హెచ్చరికలతో అప్రమత్తం చేస్తూ, SMS ద్వారా సమాచారం అందిస్తోంది. ఎమర్జెన్సీ బృందాలు, ఇంజనీరింగ్, మెయింటెనెన్స్ టీమ్‌లు 24 గంటలూ అందుబాటులో ఉన్నాయి. హైడ్రా, పోలీసు, ట్రాఫిక్, వాటర్ బోర్డ్, విద్యుత్ శాఖలతో సమన్వయం చేస్తూ చర్యలు చేపడుతున్నారు.
సాయంత్రం 5 నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అనవసర యాత్రలను నివారించాలని GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లలో నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఓల్డ్ సిటీలో ఇటీవల ఓ భవనం కూలిన నేపథ్యంలో, బలహీన భవనాలను ఖాళీ చేయిస్తూ, కొన్నింటిని కూల్చివేస్తున్నారు. ప్రజలు ఇంటిలోనే ఉండి, అత్యవసర పరిస్థితుల్లో GHMC కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు.