TELUGU INDUSTRY

టాలీవుడ్‌ లో ఉద్రిక్తత: ఫెడరేషన్‌ బంద్‌క ప్రొడ్యూసర్స్‌ గట్టి స్పందన.

టాలీవుడ్‌ ఎంప్లాయిస్ ఫెడరేషన్ షూటింగ్‌ల బంద్‌కు పిలుపునివ్వడంతో టాలీవుడ్‌ లో ఉద్రిక్తత నెలకొంది. మూడేళ్లకు ఒకసారి 30% వేతనాల పెంపు తప్పనిసరని ఫెడరేషన్ పట్టుబడుతుండగా, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇప్పటికే అధిక వేతనాలు చెల్లిస్తున్నామని, ఫెడరేషన్ బెదిరింపులకు లొంగేది లేదని స్పష్టం చేసింది. కొత్త టెక్నీషియన్లతో షూటింగ్‌లు కొనసాగిస్తామని, 24 క్రాఫ్ట్స్‌లో టాలెంటెడ్ టీమ్‌లు సిద్ధంగా ఉన్నాయని ప్రొడ్యూసర్స్ తేల్చిచెప్పారు.

ఫిల్మ్ చాంబర్ ఈ వివాదంపై గట్టి వైఖరి అవలంబిస్తూ, కార్మికుల డిమాండ్లకు తలొగ్గేది లేదని, ఇతర రాష్ట్రాల సినీ పరిశ్రమలతో పోలిస్తే టాలీవుడ్‌లో ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నామని వాదిస్తోంది. ఫెడరేషన్ బాయ్‌కాట్ పిలుపుతో షూటింగ్‌లు ఆగినా, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు సిద్ధమని చాంబర్ ప్రకటించింది. ఈ విషయంలో లేబర్ కమిషనర్‌ను ఆశ్రయించడం టాలీవుడ్‌లో తొలిసారి.

కార్మిక సంఘాలు డాన్సర్స్, ఫైటర్స్, మహిళా వర్కర్స్, ప్రొడక్షన్ డ్రైవర్స్, లైట్‌మెన్, టెక్నీషియన్ల కోసం పోరాడుతున్నామని చెప్పినప్పటికీ, చాంబర్ సంప్రదింపులకు సిద్ధంగా లేకపోవడంతో వివాదం ముదిరింది. సినిమా బడ్జెట్‌లు అమాంతం పెరుగుతున్న నేపథ్యంలో, 30% వేతన పెంపు డిమాండ్ అసమంజసమని ప్రొడ్యూసర్స్ వాదిస్తున్నారు. ఫెడరేషన్ ఒత్తిళ్లకు లొంగకుండా, కొత్త కార్యాచరణతో ముందుకు వెళ్తామని చాంబర్ స్పష్టం చేసింది. ఈ పోరాటం ఎలాంటి క్లైమాక్స్‌కు దారితీస్తుందో చూడాలి.