Hyderabad drugs

హైదరాబాద్ శివారులో డ్రగ్ పార్టీల హడావిడి: పోలీసుల దాడులు

హైదరాబాద్ శివారులో డ్రగ్ పార్టీల హడావిడి :

హైదరాబాద్ నగరంలో పోలీసుల నిఘా పెరగడంతో డ్రగ్ పార్టీలు ఇప్పుడు శివారు ప్రాంతాలకు మారాయి. బర్త్‌డే, వీకెండ్ గెట్‌టుగెదర్ పేరుతో ఫార్మ్‌హౌస్‌లు, రిసార్ట్‌లను అద్దెకు తీసుకుని యువత డ్రగ్స్‌తో హాయిగా ఎంజాయ్ చేస్తోంది. గత పది రోజుల్లోనే రెండు డ్రగ్ పార్టీలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసి, యువకుల వద్ద నుంచి పెద్ద ఎత్తున గంజాయి, హాష్ ఆయిల్, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

నగరంలో గతంలో పబ్‌లపై దృష్టి సారించిన పోలీసులు ఇప్పుడు శివారు ప్రాంతాల్లోని ఫార్మ్‌హౌస్‌లపై నిఘా పెట్టారు. వీకెండ్‌లో హైదరాబాద్ యువత ఫ్రెండ్స్‌తో కలిసి ఫార్మ్‌హౌస్‌లకు వెళ్తూ లిక్కర్, డ్రగ్ పార్టీలు నిర్వహిస్తోంది. తాజాగా చేవెళ్ళ సమీపంలోని మోయినాబాద్ మండలం మేడిపల్లిలో జరిగిన ఓ డ్రగ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ఈ పార్టీలో అభిజీత్ బెనర్జీ, సింసన్, పార్దు, గోయల్, యశ్వంత్ రెడ్డి, సెవియో డెన్నిస్ అనే ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు.

అభిజీత్ రెడ్డి పుట్టిన రోజు, ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా సెరీనాన్ ఆర్చర్డ్స్ ఫార్మ్‌హౌస్‌ను బుక్ చేసుకుని, స్నేహితులు డ్రగ్ పార్టీ నిర్వహించారు. ఎల్‌ఎస్‌డీ, హాష్ ఆయిల్‌తో పాటు పెద్ద ఎత్తున లిక్కర్‌ను తీసుకెళ్లారు. పక్కా సమాచారంతో దాడి చేసిన ఎక్సైజ్ పోలీసులు డ్రగ్స్, లిక్కర్‌ను స్వాధీనం చేసుకొని, యువకులను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ టెస్ట్‌లో వీరికి పాజిటివ్ రావడంతో ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఫార్మ్‌హౌస్ నిర్వాహకుడిపైనా కేసు నమోదైంది.

ఈగల్ టీమ్స్ నగరంలో డ్రగ్స్ సరఫరాపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి. డ్రగ్ పార్టీలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. శివారు ప్రాంతాల్లోని ఫార్మ్‌హౌస్‌లు, రిసార్ట్‌లు ఇలాంటి కార్యకలాపాలకు అడ్డాగా మారకుండా నిఘా పెంచినట్లు తెలిపారు.