fertility centre

తెలంగాణ లో ఫర్టిలిటీ సెంటర్ల తనిఖీలు ఉధృతం.

తెలంగాణ లో ఫర్టిలిటీ సెంటర్ల తనిఖీలు ఉధృతం :

సృష్టి నమ్రత కేసు నేపథ్యంలో తెలంగాణ లో ఫర్టిలిటీ సెంటర్లపై ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా 379 ప్రైవేట్ ఫర్టిలిటీ సెంటర్లు ఉండగా, వీటిలో హైదరాబాద్‌లోనే 157 నమోదై ఉన్నాయి. ఈ సెంటర్లలో తనిఖీలు నిర్వహించాలని డిఎంహెచ్‌ఓలకు ఆదేశాలు జారీ చేశారు. సరోగసీ సేవలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరని, అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు.

ఐవీఎఫ్, ఐయూఐ, సరోగసీ వంటి అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ సేవలు ఏఆర్‌టీ మరియు సరోగసీ యాక్ట్ కింద నమోదు కావాల్సి ఉంటుంది. అయితే, కొన్ని సెంటర్లు నిబంధనలు పాటించకుండా అక్రమంగా నడుస్తున్నాయని, గడువు ముగిసిన లైసెన్స్‌తో కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి సెంటర్లు బయటి నుంచి సాధారణ భవనాల్లా కనిపించినప్పటికీ, లోపల జరిగే కార్యకలాపాలు అక్రమమైనవి కావచ్చని అధికారులు అంటున్నారు.

fertility centre

అక్రమ సెంటర్ల గురించి సమాచారం అందితే, తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. ప్రజలు, మీడియా లేదా పోలీసు రైడ్‌ల ద్వారా సమాచారం అందితే, అర్హత, చట్టబద్ధతను పరిశీలించి సరోగసీకి అనుమతులు ఇస్తామన్నారు. ఒకవేళ అక్రమ కార్యకలాపాలు గుర్తిస్తే, అవి క్రిమినల్ నేరంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఫర్టిలిటీ సెంటర్ల నిర్వహణ, నమోదు ప్రక్రియ, అక్రమ కార్యకలాపాలపై దృష్టి సారించేందుకు త్వరలో తనిఖీలు నిర్వహించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ చర్యలు అక్రమ సెంటర్లను నియంత్రించి, బాధితులకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తాయని ఆశిస్తున్నారు.