గోడకు నోటీసులు చట్టవిరుద్ధం: కేసీఆర్
సిట్‌కు కేసీఆర్ ఘాటైన లేఖ… చట్టవ్యతిరేక చర్యలపై తీవ్ర అభ్యంతరం
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణ అధికారిగా ఉన్న జూబ్లీ హిల్స్ ఏసీపీకి ఆరు పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో సిట్ వ్యవహారశైలిపై ఆయన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన ఇంటి గోడకు నోటీసులు అంటించడాన్ని చట్టవ్యతిరేక చర్యగా పేర్కొన్నారు.
గోడలకు నోటీసులు అంటించమని చట్టంలో లేదు
సీఆర్పీసీ 160 ప్రకారం నోటీసులు సంబంధిత వ్యక్తికి స్వయంగా అందజేయాల్సి ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. చట్టంలో ఎక్కడా గోడలకు నోటీసులు అంటించమని లేదని పేర్కొన్నారు. రాత్రి 9 గంటల సమయంలో కొందరు వచ్చి తన నివాస గోడకు నోటీసులు అంటించడం పూర్తిగా ఆక్షేపణీయమని అన్నారు.
సుప్రీం కోర్టు, హైకోర్టు తీర్పుల ప్రస్తావన
సిట్ జారీ చేసిన నోటీసులు చట్టబద్ధంగా లేవని పేర్కొంటూ కేసీఆర్ పలు సుప్రీం కోర్టు మార్గదర్శకాలు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను తన లేఖలో ప్రస్తావించారు. చట్టాన్ని పక్కనపెట్టి వ్యవహరిస్తున్నారని సిట్‌పై ఆయన విమర్శలు గుప్పించారు.
నివాసం, పోలీస్ పరిధిపై స్పష్టత
ప్రస్తుతం తాను జూబ్లీ హిల్స్ పోలీస్ పరిధిలో నివసించడం లేదని కేసీఆర్ తెలిపారు. హరీష్ రావు అఫిడవిట్లో సిద్దిపేట చిరునామా ఉందని, నందీనగర్ను కేవలం కరస్పాండెంట్ అడ్రెస్‌గా మాత్రమే పేర్కొన్నానని గుర్తు చేశారు. గత రెండేళ్లుగా తాను ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లోనే ఉంటున్నానని స్పష్టం చేశారు.
విచారణకు సహకరిస్తానన్న కేసీఆర్
చట్టపరమైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని కేసీఆర్ తెలిపారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా చట్టాన్ని గౌరవిస్తానని అన్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి నందీనగర్ నివాసంలో అందుబాటులో ఉంటానని, సిట్ అధికారులు వచ్చి తన స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకోవచ్చని లేఖలో పేర్కొన్నారు.
రాజకీయ వర్గాల్లో ఆసక్తి
కేసీఆర్ ఇవాళ రాత్రే నందీనగర్‌కు చేరుకుంటారా? లేక రేపు ఉదయం వస్తారా? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై పార్టీ వర్గాల నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.