Headlines
GREATER HYDERABAD MUNICIPAL CORPORATION

జీహెచ్‌ఎంసీ -హైదరాబాద్‌ రోడ్ల పై చెత్త వేసిన వారి పై కఠిన చర్యలు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) వాళ్ళు హైదరాబాద్ రోడ్ల పై చెత్త వేసే వారిపై  కఠిన చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు భారీ జరిమానాలు విధించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. స్వచ్ఛత మరియు పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన జీహెచ్‌ఎంసీ, సమగ్ర చలాన్ నిర్వహణ వ్యవస్థ (సీసీఎంఎస్) పేరుతో ఒక మొబైల్ యాప్‌ను కూడా అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా హైదరాబాద్‌ రోడ్ల పై చెత్త ఎక్కడపడితే అక్కడ వేసే వారిని గుర్తించి, వారిపై జరిమానాలు విధించనున్నారు.

ముఖ్యంగా వాణిజ్య ప్రాంతాల్లో చెత్త నిర్వహణ, డస్ట్‌బిన్ల ఏర్పాటు, రోడ్ల పక్కన చెరువులు, ప్రధాన రహదారుల వద్ద మట్టి కుప్పలు వేయడం వంటి సమస్యలపై జీహెచ్‌ఎంసీ తీవ్ర దృష్టి పెట్టింది. ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రతి దుకాణం, టిఫిన్ సెంటర్, వ్యాపార సంస్థల వద్ద రెండు చెత్త డబ్బాలు తప్పనిసరిగా ఉంచాలని నిర్ణయించింది. ఒకవేళ డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేయకపోతే రూ.100 నుంచి రూ.2000 వరకు జరిమానా విధించనున్నారు. అలాగే, డస్ట్‌బిన్‌లు ఉన్నప్పటికీ చెత్త బయట కనిపిస్తే, సంబంధిత దుకాణం లేదా టిఫిన్ సెంటర్ యజమానిపై జరిమానా విధించి, ఫోన్ నంబర్ ఆధారంగా పెనాల్టీ జనరేట్ చేయనున్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో చెత్త నిర్వహణతో పాటు మట్టి కుప్పలు, నిర్మాణ వ్యర్థాలు అక్రమంగా డంప్ చేయడం కూడా పెద్ద సవాలుగా మారింది. గత నెలలో ఈ కారణంగా జీహెచ్‌ఎంసీ రూ.42 లక్షల జరిమానా విధించింది. జనవరి నెలలోనే రూ.14.24 లక్షల జరిమానా వసూలు చేయడం ద్వారా ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 762 ప్రాంతాల్లో 1158 డంపింగ్ పాయింట్లను గుర్తించిన అధికారులు, వాహన నంబర్ ఆధారంగా జరిమానాలు విధించేందుకు సిద్ధమయ్యారు. మొదటి సారి రూ.25,000, రెండో సారి రూ.50,000, మూడో సారి రూ.1 లక్ష జరిమానా విధించనున్నారు.

జరిమానాలు వసూలు చేయడం కోసం జీహెచ్‌ఎంసీ ప్రత్యేక విధానాలను రూపొందించింది. దుకాణాలకు సంబంధించిన జరిమానాలను ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ ఫీజుతో లింక్ చేయనున్నారు. అలాగే, వ్యక్తులు చెత్త వేస్తే వారి మొబైల్ నంబర్ ఆధారంగా ప్రాపర్టీ టాక్స్‌తో జరిమానాను జోడించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అద్దెదారుల విషయంలో ఇంటి నంబర్ ఆధారంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

జీహెచ్‌ఎంసీ అధికారులు నగర ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, చెత్తను స్వచ్ఛ ఆటో కార్మికులకు లేదా సమీపంలోని జీహెచ్‌ఎంసీ చెత్త బిన్‌లలో మాత్రమే వేయాలని సూచించారు. రోడ్లపై లేదా డస్ట్‌బిన్‌ల పక్కన చెత్త విసిరేస్తే జరిమానా తప్పదని స్పష్టం చేశారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండి, స్వచ్ఛత పాటించాలని అధికారులు కోరుతున్నారు.