
మధురై మహానాడు: తమిళనాడు రాజకీయాల్లో విజయ్ హవా
తమిళనాడు రాజకీయాలు మధురైలో జరగనున్న తమిళగ వెట్రీ కళగం (టీవీకే) రెండో మహానాడు చుట్టూ తిరుగుతున్నాయి. టీవీకే అధ్యక్షుడు, సినీ హీరో విజయ్ ఈ సభ ద్వారా రాజకీయ వ్యూహాలను ప్రకటించనున్నారు. 2024లో పార్టీ స్థాపించిన తర్వాత, విజయ్ తమిళనాడు రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు. ఆగస్టు 21న మధురైలో జరిగే ఈ సభకు 4 లక్షల మంది హాజరవుతారని అంచనా. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7:30 గంటలకు ముగియనున్న ఈ సభ కోసం 50 భారీ ఎల్ఈడి స్క్రీన్లు, 50 వేల సీట్లు, మహిళలకు ప్రత్యేక పింక్ రూమ్, 3000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.
విజయ్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, సైనిక క్రమశిక్షణతో హాజరు కావాలని, గర్భిణీలు, వృద్ధులు, వికలాంగులు రావద్దని సూచించారు. ఈ సభలో 2026 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంతో విజయ్ తన కార్యాచరణ, విజన్ డాక్యుమెంట్, పార్టీ కమిటీలను ప్రకటించనున్నారు. అధికార డీఎంకేను ఇరుకున పెట్టేలా పొత్తులు, పవర్ షేరింగ్ అంశాలపై క్లారిటీ ఇవ్వనున్నారని సమాచారం. మహిళలు, యువత, మైనారిటీలు, దళిత వర్గాలను ఆకర్షించేలా విజయ్ స్పీచ్, పథకాలు ఉంటాయని టీవీకే వర్గాలు చెబుతున్నాయి.
పొత్తుల విషయంలో డీఎంకే, బీజేపీలను ప్రత్యర్థులుగా చూస్తున్న విజయ్, కాంగ్రెస్, ఏఐడీఎంకేలతో చర్చలు జరిపినప్పటికీ, ఫలితం లేకపోవడంతో సోలోగా ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ మహానాడు డ్రవిడియన్ ఓట్లను ఆకర్షించేలా విజయ్ వ్యూహాలతో తమిళనాడు రాజకీయాలను షేక్ చేయనుంది.