banakacharla project

బనకచర్ల ప్రాజెక్ట్‌ పై తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం.

బనకచర్ల ప్రాజెక్ట్‌ తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ వివాదంగా మారింది. గోదావరి జలాలను కృష్ణా, పెన్నా నదులతో అనుసంధానం చేసే ఈ ప్రాజెక్ట్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వేగవంతం చేస్తుండగా, తెలంగాణ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో నీటి ఎద్దడిని తీర్చనుందని, సముద్రంలోకి వృథాగా పోయే జలాలను వినియోగిస్తుందని ఏపీ మంత్రి నారా లోకేష్ వాదించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు ఏపీ అడ్డు చెప్పలేదని, తెలుగు రాష్ట్రాలు సహకరించాలని ఆయన పేర్కొన్నారు.

అయితే, తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు దీనికి కౌంటర్ ఇస్తూ, బనకచర్ల ప్రాజెక్ట్‌ ను అడ్డుకుంటామని, దీనికి అన్ని అనుమతులు లేవని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్‌ను ఉల్లంఘిస్తుందని, తెలంగాణ జల హక్కులకు భంగం కలిగిస్తుందని ఆరోపించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ వివాదంపై చర్చలకు టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఢిల్లీలో త్వరలో మరో దఫా చర్చలు జరగనున్నాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య ఈ అంశంపై వాగ్వాదం తీవ్రమవుతోంది. బనకచర్ల ప్రాజెక్ట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సలసల మరుగుతున్న హాట్ టాపిక్‌గా మారింది.