
కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బిఆర్ఎస్‌లో చర్చ.
కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బిఆర్ఎస్‌లో చర్చ కేసీఆర్ హాజరవుతారా లేదా, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ జారీ చేసిన నోటీసులు. బిఆర్ఎస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జూన్ 5న విచారణకు హాజరు కావాలని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కమిషన్ నోటీసులు పంపింది. అయితే, కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేక గతంలో విద్యుత్ కమిషన్ విషయంలో చేసినట్లు లేఖ ద్వారా సమాధానం ఇస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.
గతంలో విద్యుత్ కమిషన్ నోటీసులు జారీ చేసినప్పుడు కేసీఆర్ వ్యక్తిగతంగా హాజరు కాకుండా, విచారణ గడువు కోరారు. ఆ తర్వాత కమిషన్‌ను రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. అంతేకాక, లేఖ ద్వారా విద్యుత్ కమిషన్‌కు వివరణ అందించారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌కు సంబంధించిన వివరాలను కూడా ఆయన లేఖలో వివరించారు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విషయంలో కూడా ఇదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉందని బిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో ఉండగా, హరీష్ రావు సిద్దిపేట పర్యటనలో ఉన్నారు. నోటీసులపై ఇంకా అధికారిక స్పందన రాలేదని, అయితే సాయంత్రం వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాళేశ్వరం కమిషన్ నోటీసులకు లేఖ ద్వారా సమాధానం ఇచ్చే దిశగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అవసరమైతే విచారణకు హాజరయ్యేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని బిఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు.
ఈ నోటీసులు బిఆర్ఎస్ పార్టీకి కీలక పరీక్షగా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.