
దేశంలో వీధి కుక్కల సమస్యపై పెరుగుతున్న వివాదం.
దేశంలో వీధి కుక్కల స్వైర విహారం పెరుగుతున్న క్రమంలో, గ్రామాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇటీవల ఒకే గ్రామంలో ఒకే రోజున ఐదుగురిని కరిచిన ఘటన, పిచ్చి కుక్కల దాడిలో చిన్నారి, వ్యక్తి మృతి వంటి సంఘటనలు కలకలం రేపాయి. కలెక్టరేట్, ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణాల్లో సైతం కుక్కలు తిరుగుతున్నాయి.
ఈ పరిస్థితులపై ఢిల్లీలో వీధి కుక్కల సమస్య మరింత ముదురుతోంది. వీటిని పట్కొని షెల్టర్లలో ఉంచాలని సుప్రీం కోర్టు ఆదేశాలు వెలువడగా, జంతు ప్రేమికులు దీనికి వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నారు. యాక్టర్లు జాన్ అబ్రహం, జాన్వి కపూర్, అడవి శేషు వంటి పలువురు సెలబ్రిటీలు వీధి కుక్కల తరపున నిలబడ్డారు.
మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ మాట్లాడుతూ, దేశంలో వీధి కుక్కలు సుమారు 3 లక్షలు ఉన్నాయని, వాటిని అన్నింటిని షెల్టర్లలో పెట్టడానికి 3,000 షెల్టర్లు, కనీసం ₹15,000 కోట్ల వ్యయం అవసరమని పేర్కొన్నారు. కుక్కలను పూర్తిగా తొలగించడం సాధ్యం కాదని, బదులుగా టీకాలు వేయడం, వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అయితే ప్రజల్లో ఒక వర్గం మాత్రం కుక్కలు దాడి చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారన్న ఆందోళనలో ఉంది. సమస్య పరిష్కారం కోసం సమతుల్య దారి అవసరమని, లేకుంటే మానవులు–మృగాల మధ్య ఘర్షణ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.