
హరి హర వీరమల్లు – ట్రైలర్ ఊహించని సంచలనం.
హరి హర వీరమల్లు:
అభిమానుల అంచనాలని పెంచేసిన ట్రైలర్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నాళ్ళ నుండో ఎదురుచూస్తున్న “హరి హర వీరమల్లు” సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడైతే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ చూసిన తర్వాత, సినిమా మీద అంచనాలు మామూలుగా లేవు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ పిరియడ్ యాక్షన్ డ్రామాను ఏ.ఎం. రత్నం సమర్పణలో, ఎ. దయాకర్ రావు నిర్మించారు. ఈ సినిమా జూలై 24, 2025న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న అభిమానులకి ఫీస్ట్ గా “హరి హర వీరమల్లు” ట్రైలర్ ని జూలై 3, 2025న విడుదల చేసారు. దాదాపు 2 నిమిషాల 57 సెకన్ల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ చూస్తుంటే, పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్, విజువల్స్, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం. అన్నీ కలిసి మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్లిపోయాయి.
ట్రైలర్ మొదట్లోనే “హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్ షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం” అనే పవర్ఫుల్ వాయిస్ ఓవర్ తో మొదలైంది. దీన్ని బట్టి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ఒక ధైర్యవంతుడైన బందిపోటు యోధుడి కథ గా చిత్రీకరించారు.
పవన్ కళ్యాణ్ గారు వీరమల్లు పాత్రలో జీవించేశారు అనడంలో సందేహమే లేదు. ఆయన బాడీ లాంగ్వేజ్, కత్తియుద్ధాలు, యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ‘ఆంధి వచ్చేసింది’ అని చెప్పే డైలాగ్ అయితే హైలైట్. నిధి అగర్వాల్ కథానాయికగా పవన్ కళ్యాణ్ కు పర్ఫెక్ట్ జోడీగా కనిపించిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
జ్ఞాన శేఖర్, మనోజ్ పరమహంస అందించిన సినిమాటోగ్రఫీ అయితే అద్భుతం. భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన ప్రతి షాట్ కూడా కనుల పండుగే. ఎమ్.ఎమ్. కీరవాణి గారు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ట్రైలర్ కు ప్రాణం పోసింది. పాటలు ఇప్పటికే విడుదలయ్యి మనందరినీ ఆకట్టుకుంటున్నాయి.
మొత్తానికి, హరి హర వీరమల్లు ట్రైలర్ చూశాక సినిమా బ్లాక్ బస్టర్ అవడం పక్కా అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. భారీ బడ్జెట్ తో, అద్భుతమైన నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు, సినీ ప్రియులకు ఒక గొప్ప అనుభూతినిస్తుందని ట్రైలర్ చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. సినిమా కోసం ఇక వెయిటింగ్.