టీసీఎస్‌ లో భారీ ఉద్యోగ కోతలు: 12,261 మంది ఉద్యోగుల తొలగింపు

టీసీఎస్‌ లో భారీ ఉద్యోగ కోతలు: 12,261 మంది ఉద్యోగుల తొలగింపు

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 12,261 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ అనిశ్చితులు మరియు కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రభావం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీసీఎస్ సీఈవో కృతి వాసన్ తెలిపారు. మొత్తం 6,13,569 మంది ఉద్యోగుల్లో 2 శాతం మందిని తొలగించే నిర్ణయం కంపెనీని కుదిపేస్తోంది. ముఖ్యంగా మధ్య, సీనియర్ స్థాయి మేనేజర్లపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.

TCS LAYOFFS

టీసీఎస్ కొత్త టెక్నాలజీపై ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నప్పటికీ, కొంతమందిని తొలగించక తప్పని పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. ఏడాదిలో కనీసం 225 రోజులు ప్రాజెక్ట్‌లో ఉండాలని, బెంచ్‌పై గరిష్టంగా 35 రోజులు మాత్రమే ఉండాలని కంపెనీ నిబంధనలు సవరించింది. ఈ నిబంధనలను సవాల్ చేస్తూ కొందరు ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు.

ఇదే సమయంలో, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో టాప్ ఆరు ఐటీ కంపెనీల రిక్రూట్‌మెంట్ 72% తగ్గింది. ఐటీ రంగంలో తీసివేతలు పెరుగుతుండగా, కొత్త నియామకాలు దాదాపు నిలిచిపోయాయి. ఈ పరిస్థితి ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.