Headlines
corona virus

కరోనా మళ్లీ కలకలం.

కరోనా మళ్లీ కలకలం సింగపూర్, హాంగ్‌కాంగ్‌లో కేసులు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ మరోసారి తన కరాళ నృత్యాన్ని ప్రదర్శిస్తోంది. సింగపూర్ మరియు హాంగ్‌కాంగ్‌లో కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. నిపుణులు దీనిని కొత్త వేవ్‌గా అభివర్ణిస్తున్నారు. కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది.

సింగపూర్‌లో ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో కోవిడ్ కేసులు 28 శాతం పెరిగాయి. అదే సమయంలో ఆసుపత్రిలో చేరుతున్నవారి సంఖ్య 30 శాతం పెరిగింది. హాంగ్‌కాంగ్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు హాంగ్‌కాంగ్‌లో కోవిడ్ కారణంగా 31 మంది మరణించారు.

అయితే, భారత్‌లో ప్రస్తుతానికి  కోవిడ్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో ప్రస్తుతం 257 కోవిడ్ కేసులు నమోదయ్యాయి, వీటిలో అందరికీ స్వల్ప లక్షణాలు (మైల్డ్ సింటమ్స్) మాత్రమే ఉన్నాయి.

ఇదిలా ఉండగా, ప్రముఖ నటుడు మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్‌కు కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో, అందరూ మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.