ధర్మస్థలి లో శవాల రహస్యం: 15 ప్రాంతాల్లో తవ్వకాలు ఆరంభం
దక్షిణ కర్ణాటకలోని ధర్మస్థలి లో దాదాపు 100కు పైగా శవాలను అనధికారికంగా పాతిపెట్టినట్లు ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపించడం సంచలనం రేపింది. ఈ ఆరోపణల నేపథ్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణ చేపట్టి, ఆ వ్యక్తి సూచించిన 15 ప్రాంతాలను గుర్తించింది. నేత్రావతి నదీ తీరంలో ఎనిమిది, హైవే సమీపంలో నాలుగు, అజికూరి హైవేలో ఒకటి, కన్వాడి ప్రాంతంలో రెండు చోట్ల శవాలను పాతిపెట్టినట్లు ఆ వ్యక్తి వెల్లడించాడు.

సిట్ బృందం ఈ ప్రాంతాలను పరిశీలించి, తవ్వకాల కోసం గుర్తించిన చోట్లను క్రైమ్ జోన్‌గా గుర్తించి, భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ వ్యక్తిని భారీ భద్రత మధ్య తీసుకొచ్చి, అతని గుర్తింపును గోప్యంగా ఉంచేందుకు ప్రత్యేక మాస్క్ ధరింపచేశారు. ఈ శవాలలో ఎక్కువగా మహిళలు, యువతులు, మైనర్ బాలికలు ఉన్నారని, వారిపై అత్యాచారం, హత్యలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. 2010లో ఒక 15 ఏళ్ల స్కూల్ విద్యార్థిని మృతదేహాన్ని కూడా పాతిపెట్టినట్లు అతను చెప్పడం కలకలం రేపింది.
ఈ ఆరోపణలు నిజమైతే, 1995-2014 మధ్య దక్షిణ కర్ణాటకలో అదృశ్యమైన 250 మంది మహిళల కేసులతో ఈ శవాలకు సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తవ్వకాల్లో అస్తిపంజరాలు లేదా ఎముకలు దొరికితే, డీఎన్ఏ పరీక్షల ద్వారా వాటిని గుర్తించే ప్రయత్నం జరుగుతుంది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే, స్థానికులు ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ, ధర్మస్థలి సురక్షిత ప్రాంతమని, ఈ వాదనలు ప్రాంత ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర అని అంటున్నారు. కర్ణాటక హోమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ విచారణపై దృష్టి సారించారు.