
బాపట్ల గ్రానైట్ క్వారీ లో ఘోర ప్రమాదం: ఐదుగురు మృతి
బాపట్ల గ్రానైట్ క్వారీ లో ఘోర ప్రమాదం,బాపట్ల జిల్లా బల్లికురువ సమీపంలోని సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో శనివారం ఘోర ప్రమాదం సంభవించింది. గ్రానైట్ స్లాబ్ అంచు విరిగి పడటంతో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. మృతులంతా ఒడిస్సాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో క్వారీలో 15 మందికి పైగా కార్మికులు పనిచేస్తుండగా, ఈ దుర్ఘటనలో మరికొంతమంది గాయపడ్డారు. క్షతగాత్రులను నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు.
బాపట్ల గ్రానైట్ క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం గ్రానైట్ స్లాబ్‌ను బయటకు తీసే ప్రక్రియ కొనసాగుతోంది. స్లాబ్ తొలగించిన తర్వాత మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గ్రానైట్ క్వారీలలో ఇటువంటి ఘటనలు పదేపదే సంభవిస్తున్నప్పటికీ, యాజమాన్యం తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ఇటువంటి దుర్ఘటనలకు కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై విచారణ జరపాలని ఆదేశించారు. తగిన భద్రతా చర్యలు లేకపోవడం వల్ల ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.