ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు: వరదలతో అతలాకుతలమైన ప్రాంతాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో వరదలు ముంచెత్తాయి. చుండూరులో 27.4 సెంటీమీటర్లు, చేబ్రోలులో 23.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుడమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో విజయవాడలో గుండదల మండలం, వన్‌టౌన్‌లో వరద నీరు చేరింది. డ్రైన్‌లో పడి ఇద్దరు మృతి చెందగా, లయోలా కాలేజీ సమీపంలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు.
గుంటూరు జిల్లాలో పెదకూరపాడు నియోజకవర్గం అస్తవ్యస్తమైంది. అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పెదమద్దూరులో వాగు ఉద్ధృతంతో 1000 ఎకరాల పంటలు మునిగాయి. కొండవీటి వాగు ప్రవాహంతో నరుకులపాడు, ఉంగుటూరు, ఖమ్మంపాడు గ్రామాలు జలమయమయ్యాయి. పులిచింతల ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలతో కృష్ణానది దిగువ ప్రాంతాల్లో వరద పెరిగింది. బల్లకట్టు పడవల రాకపోకలు నిలిచిపోయాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో కొండవాగులు పొంగాయి. రాజవమంగి మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వట్టిగడ్డ వద్ద కొండవాగు ప్రవహంతో రాకపోకలు స్తంభించాయి. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం సూదికొండ వద్ద రహదారిపై వరద నీరు ప్రవహించి, గోకవరం-జగ్గంపేట మార్గంలో అంతరాయం ఏర్పడింది. వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి.
గుంటూరు జిల్లా నంబూరు నుంచి దుగ్గిరాల మార్గంలో వరద నీరు పొంగి ప్రవహిస్తున్నది. మోకాల్లోతు నీరుతో ద్విచక్ర వాహనాలు నిలిచిపోయాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. “రెండు రోజులుగా ఇదే పరిస్థితి. పొలాలు మునిగాయి, డ్రైనేజీ వ్యవస్థ సరిలేదు” అని గ్రామస్థులు వాపోతున్నారు. కాల్వలు తెగడం, ఎగువ ప్రాంతాల నుంచి నీరు రావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.