విశాఖలో లక్ష చీరలతో సుందర వస్త్ర మహాగణపతి.
విశాఖలో గాజువాక లంకా మైదానంలో గణేశ్ నవరాత్రుల కోసం 111 అడుగుల ఎత్తైన భారీ గణపతి విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. లక్ష చీరలతో అలంకరించిన ఈ ఎకో-ఫ్రెండ్లీ విగ్రహం, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ను నివారించి, చీరాలకు చెందిన 26 మంది కళాకారుల బృందం రెండు నెలలుగా శ్రమించి తయారు చేస్తోంది. తమిళనాడు, సూరత్, పశ్చిమ బెంగాల్ నుంచి సేకరించిన చీరలతో స్వామివారి అలంకరణ జరుగుతోంది.

ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలు 21 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. సాయంత్రం 4:30 గంటలకు ముంబై తరహాలో స్వామివారి ఆగమనం, తీన్మార్ బృందాలతో ఘనంగా నిర్వహించనున్నారు. 27వ తేదీ ఉదయం 11:02 గంటలకు మధుర పూజ, 17వ తేదీ వరకు పసుపు, కుంకుమ అభిషేకాలు, వస్త్ర పంపిణీ జరుగుతాయి. గతంలో మూడుసార్లు గిన్నీస్ రికార్డు సాధించిన విశాఖలో గాజువాక లడ్డు ఈసారి కూడా భక్తులను ఆకర్షిస్తుంది. 15 అడుగుల భారీ అగరబత్తి నాలుగు రోజుల పాటు స్వామివారికి ధూపం వేయనుంది.

చంద్రగ్రహణం కారణంగా 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి దర్శనాలు నిలిపివేసి, 8వ తేదీ ఉదయం ప్రక్షాళన, హోమాలతో తిరిగి ప్రారంభిస్తారు. ఉత్తరాంధ్రం నుంచి లక్షలాది భక్తులను ఆకర్షించే ఈ ఉత్సవం, ఖైరతాబాద్ వినాయకుడితో పోటీపడేలా వైభవంగా నిర్వహించబడుతోంది.