
తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి కేసు: సిట్ దర్యాప్తులో ముందడుగు
తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఆరోపణల కేసులో సిట్ దర్యాప్తు ఊపందుకుంది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ, గతంలో నెయ్యి సరఫరా చేసిన ఉత్తరాఖండ్‌కు చెందిన బోలే బాబా డైరీలో ఒప్పందాల వెనుక జరిగిన రహస్య ఒప్పందాలను బయటపెట్టేందుకు సిట్ లోతుగా విచారణ చేస్తోంది.
టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్న, మాజీ జెఈఓ గౌతమి, కోల్కతాకు చెందిన వ్యాపారి జ్యోతిష్‌లను సిట్ రెండు రోజులుగా విచారిస్తోంది. తిరుపతి అలిపిరి సమీపంలోని సిట్ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. అప్పన్న నుంచి కొంత సమాచారం సేకరించినప్పటికీ, ఆయన దాటవేసే సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
2019-2023 మధ్య వైవి సుబ్బారెడ్డి టిటిడి చైర్మన్‌గా ఉన్నప్పుడు బోలే బాబా డైరీ నెయ్యి సరఫరా చేసింది. సాంకేతిక కారణాలతో ఈ సంస్థను నిషేధించగ, ఏఆర్ డైరీ ద్వారా కల్తీ నెయ్యి సరఫరాకు ప్రయత్నం జరిగినట్లు సిట్ గుర్తించింది. టెండర్ నిర్వహణ, అధికారుల పర్యవేక్షణలో లోటుపాట్లపై సిట్ ప్రశ్నలు సంధించింది. ఈ కేసు కీలక దశలో ఉన్నట్లు సమాచారం.