Chinthalapudi

చింతలపూడిలో బొగ్గు తవ్వకాలకు కేంద్రం సిద్ధం

చింతలపూడిలో బొగ్గు తవ్వకాలకు కేంద్రం సిద్ధం: రేచర్ల బ్లాక్‌కు టెండర్లు ప్రక్రియ ప్రారంభం

ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో, ఖమ్మం సరిహద్దు ప్రాంతంలో ఉన్న బొగ్గు నిక్షేపాలను వెలికితీతకు కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. 22 కిలోమీటర్ల పరిధిలో 2.225 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. మొదటి దశలో చింతలపూడి రేచర్ల బొగ్గు బ్లాక్‌కు టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు. నవంబర్ 27 వరకు టెండర్లు సమర్పించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. రేచర్లతో పాటు దేశవ్యాప్తంగా 13 బ్లాక్‌లకు టెండర్లు కోరారు. ఈ ప్రాంతంలో G13 గ్రేడ్ బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించగా, 2050 చదరపు కిలోమీటర్ల పరిధిలో అపార నల్ల బంగారం లభిస్తుందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) సర్వేలు నిర్ధారించాయి. ఈ బొగ్గు 623 మీటర్ల నుంచి 1123 మీటర్ల లోతుల్లో ఉంది.

coal mines

నవంబర్ 25న టెక్నికల్ బిడ్‌లు తెరవగా, నెలాఖరు వారంలో వేలం జరిగి గని కేటాయింపు జరుగుతుంది. 22.24 చదరపు కిలోమీటర్లలో రేచర్ల, ఎర్రగుంటపల్లి, సీతానగరం, మేడిశెట్టివారిపల్లి, లింగగూడెం, రాఘవాపురం గ్రామాల్లో బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. 1964 నుంచి 2016 వరకు జరిగిన సర్వేల్లో ఈ ప్రాంతంలో నాణ్యమైన బొగ్గు లభ్యమని నిర్ధారణ అయింది.

స్థానికుల్లో ఈ అభివృద్ధిపై ఆశలు పెరిగాయి. బొగ్గు తవ్వకాలు మొదలైతే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, చింతలపూడి ‘ఆంధ్ర సింగరేణి’గా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. మౌలిక వసతుల అభివృద్ధి, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాయని ఆశిస్తున్నారు. కానీ, తవ్వకాలు ఎప్పటి నుంచి మొదలవని, ఏ కంపెనీలు బిడ్ వేస్తాయో అనేది ఆసక్తికరంగా మారింది.