
ఆంధ్రప్రదేశ్ లో 32 జిల్లాల ఏర్పాటుపై చర్చ.
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 13 జిల్లాలను 25 జిల్లాలుగా విస్తరించగా, ప్రస్తుతం 32 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను క్యాబినెట్ సబ్-కమిటీ సమీక్షించి, అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల రియల్ ఎస్టేట్, వనరుల అభివృద్ధి, మౌలిక వసతులు పెరిగి, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. శ్రీకాకుళం జిల్లాను రెండుగా విభజించి, పలాస (ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం) మరియు శ్రీకాకుళం (శ్రీకాకుళం, ఆముదలవలస, నరసన్నపేట, రాజాం, ఎచ్చెర్ల) జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు. అలాగే, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, అమరావతి, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, హిందూపురం, అనంతపురం, ఆదోని, కర్నూలు, నంద్యాల, కడప, రాజంపేట జిల్లాలుగా ప్రతిపాదించారు.
ఈ 32 జిల్లాల ఏర్పాటుతో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 175 నుంచి 220కి, పార్లమెంట్ స్థానాలు 25 నుంచి 30కి పెరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రతిపాదనలు చర్చించి, అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.