adilabad floods

ఆదిలాబాద్ లో భారీ వర్షాలు – కాలనీలు జలమయం.

ఆదిలాబాద్ లో భారీ వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. నిరంతర వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించాయి. ఆదిలాబాద్ లో గ్రీన్ సిటీ కాలనీ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలీసులు ఎవరూ వరద నీటిలోకి వెళ్లకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.

సుభాష్ నగర్, విద్యానగర్, హ్యాండీక్యాప్డ్ కాలనీ, పల్లి కాలనీ వంటి లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. అనేక కుటుంబాలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై అంతస్తుల్లోకి వెళ్లి తలదాచుకున్నాయి. తినుబండారాలు, షాపులు కూడా నీటిలో మునిగిపోయాయి. దాదాపు 30–40 ఇళ్ల వరకు వరద నీరు చేరిందని అధికారులు తెలిపారు.

adilabad floods

స్థానికులు చెబుతున్నట్లుగా ఇదే పరిస్థితి 2018లో కూడా ఎదురైంది. అప్పటినుంచి సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునరావాసం లేదా రిటైనింగ్ వాల్ వంటి శాశ్వత చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ప్రస్తుతం అధికారులు, పోలీసులు పరిస్థితిని నిశితంగా గమనిస్తూ, అవసరమైతే 100 నంబర్‌కి ఫోన్ చేయాలని సూచించారు. రికార్డు స్థాయిలో వర్షపాతం కారణంగా వరద ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని, బాధితులకు తక్షణ సహాయం అందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.